Muda case: ముడా కేసులో కీలక పరిణామం.. కోర్టుకు లోకాయుక్త నివేదిక !

by B.Srinivas |

ముడా స్కామ్ కేసులో మైసూరు లోకాయుక్త పోలీసులు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది.

Muda case: ముడా కేసులో కీలక పరిణామం.. కోర్టుకు లోకాయుక్త నివేదిక !
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) దంపతులకు సంబంధించిన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) స్కామ్ కేసులో మైసూరు లోకాయుక్త పోలీసులు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ముడా కేసుపై ఈ నెల 27న విచారణ జరగనుంది. దీనిపై ఒక రోజు ముందే నివేదిక అందజేయాల్సి ఉంది. అయితే శనివారం, ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ నెల 24నే రిపోర్ట్ అందజేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే నివేదికపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కోర్టు విచారణ నేపథ్యంలో లోకాయుక్త నివేదికలో ఏముందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 2024 సెప్టెంబర్ 27న సిద్ధరామయ్య, ఇతరులపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా లోకాయుక్త పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ చేసింది.

కాగా, మైసూరు పట్టణాభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన వారి కోసం ముడా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 50:50 అనే ఈ స్కీమ్‌లో భూమి కోల్పోయిన వ్యక్తులు అభివృద్ధి చేసిన భూమిలో 50శాతం అర్హులు. ఇది 2009లో మొదటిసారి అమలులోకి వచ్చింది. అయితే 2020లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ ముడా 50:50 పథకం కింద భూమిని సేకరించి కేటాయించింది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి బెనిఫిట్స్ దక్కాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ముడా కుంభకోణం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

Next Story