బ్యాంకులో భారీ దోపిడీ.. తుపాకులతో బెదిరించి 20 నిమిషాల్లో లూటీ

by Prasad Jukanti |

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాకులో భారీ దోపిడీ జరిగింది. సినిమాటిక్ స్టైల్‌లో తుపాకులతో దాడి చేసిన గ్యాంగ్ బీభత్సం సృష్టించింది.

బ్యాంకులో భారీ దోపిడీ.. తుపాకులతో బెదిరించి 20 నిమిషాల్లో లూటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పట్టపగలే దోపిడీ ముఠా రెచ్చిపోయింది. ఏకంగా బ్యాంకులోకి చొరబడి 20 నిమిషాల్లోనే అంతా లూటీ (Bank Robbery) చేసింది. మధ్యప్రదేశ్‍లోని సింగ్రౌలిలోని (Singrauli) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra) శాఖలో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు కలకలం రేపుతోంది. నగలు, రూ.35 లక్షల నగదు దోచుకుని పరారైన ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తొలుత కస్టమర్ల మాదిరిగా బ్యాంకులోకి ప్రవేశించి ఐదుగురు వ్యక్తులు ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న తుపాకులను చూపి బ్యాంకులో ఉన్న కస్టమర్లను, సిబ్బందిని బెదిరించారు. ఇంతలో మరో ముగ్గురు దుండగులు బ్యాంకులోకి చొరబడి పలు రౌండ్లు కాల్పులు జరుపుతూ లాకర్ల తాళాలు, నగదు నిల్వలు ఇవ్వమని బ్రాంచ్ మేనేజర్ ను బెదిరించారు. మేనేజర్ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా అతనిపై దాడి చేసి తుపాకీ వెనుక భాగంతో తలపై బలంగా కొట్టి బలవంతంగా తాళాలు లాక్కున్నారు. అనంతరం లాకర్లలోని విలువైన ఆభరణాలు, నగదుతో వారు అక్కడి నుండి పరారయ్యారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ దోపిడీ అక్కడున్న వారందరిని నివ్వెరపోయేలా చేసింది.

సెక్యూరిటీ గార్డు లేకపోవడమే లోపమా?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో సెక్యూరిటీ గార్డు లేకపోవడం దుండగులకు కలిసి వచ్చిందని చెప్పారు. అడ్డుకునే వారు ఎవరూ లేకపోవడంతో వారు సులభంగా తమ పని పూర్తి చేసుకున్నారని అంతా నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఈ దోపిడీ ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story