మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఎన్ కౌంటర్!

by Prasad Jukanti |   (  Updated:2026-01-17 06:12:15  IST  )

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఎన్ కౌంటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్ గఢ్‍లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‍లో (Bijapur Encounter) ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‍గా ఉన్న మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు (డీకేఎస్‌జడ్‌సీఎం) పాపారావు అలియాస్ మోంగు (Papa Rao Mongu) (57) మరణించారు. పాపారావు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు.

పాపారావుపై రూ.కోటి రివార్డు..

ఛత్తీస్‍గఢ్‌లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు.. మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకడిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్‍లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉంది. దీంతో గత కొంతకాలంగా 'ఆపరేషన్ పాపారావు' (Operation Papa Rao) పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాపారావు దళం సంచరిస్తోందన్న సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CoBRA దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించారు. పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

తప్పించుకున్న చోటే ఎన్‌కౌంటర్..

తనకోసం చాలా కాలంగా గాలిస్తున్న భద్రతా దళాల నుంచి పాపారావు గతేడాది నవంబర్ లో తృటిలో తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నవంబర్ 11న జరిగిన ఎన్‍కౌంటర్ నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ ఘటనలో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్నతో పాటు పాపారావు భార్య పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి ఊర్మిళ మృతి చెందింది. అయితే నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో నుంచి తప్పించుకున్న పాపారావు ఇప్పుడు అదే అడవుల్లో భద్రతా దళాల చేతిలో చనిపోయారు.

Read More..

బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Next Story