Diaper Protection : పసికందును బావిలో పడేసిన కోతి.. రక్షణ కవచమైన డైపర్..!

by Ramesh Naini |

మృత్యువు కోతి రూపంలో దాడి చేసినా.. అదృష్టం 'డైపర్' రూపంలో ఆ పసికందును కాపాడింది. తల్లి ఒడిలో నుంచి 20 రోజుల పసిబిడ్డను లాక్కెళ్లిన కోతి, ఆ చిన్నారిని ఓ బావిలోకి విసిరేసింది.

Diaper Protection : పసికందును బావిలో పడేసిన కోతి.. రక్షణ కవచమైన డైపర్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మృత్యువు కోతి రూపంలో దాడి చేసినా.. అదృష్టం 'డైపర్' రూపంలో ఆ పసికందును కాపాడింది. తల్లి ఒడిలో నుంచి 20 రోజుల పసిబిడ్డను లాక్కెళ్లిన కోతి, ఆ చిన్నారిని ఓ బావిలోకి విసిరేసింది. అయితే పాప వేసుకున్న డైపర్ ఆమెను నీటిలో మునిగిపోకుండా చేయగా, స్థానికంగా ఉన్న ఓ నర్సు చేసిన అత్యవసర చికిత్స ఆ చిన్నారి ప్రాణాలను నిలబెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే..

సివ్‌నీ గ్రామానికి చెందిన సునీత రాథోడ్ తన 20 రోజుల బిడ్డతో ఇంటి బయట కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేసింది. అందులో ఓ కోతి సునీత చేతుల్లోని బిడ్డను బలంగా లాక్కొని ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గట్టిగా కేకలు వేస్తూ, టపాసులు పేల్చడంతో భయపడిన ఆ వానరం.. చేతిలోని బిడ్డను ఇంటి సమీపంలోని ఓ బావిలోకి విసిరేసి పారిపోయింది.

రక్షణ కవచమైన డైపర్

వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు బకెట్ సాయంతో బావిలో నుంచి పాపను బయటకు తీశారు. అయితే, ఆ సమయంలో పాప వేసుకుని ఉన్న డైపర్ (Diaper) నీటిని పీల్చుకోకపోవడంతో, బరువు పెరగకుండా బిడ్డ నీటిపైనే కాసేపు తేలియాడింది. దీనివల్ల పాప పూర్తిగా నీటిలో మునిగిపోకుండా కొంత సమయం ఉంది. బిడ్డను బయటకు తీసే సమయానికి శ్వాస ఆగిపోయి అపస్మారక స్థితిలో ఉంది. అయితే, అదృష్టవశాత్తు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరైన 'రాజేశ్వరి రాథోడ్' అనే నర్సు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బిడ్డ పరిస్థితిని గమనించి, తక్షణమే CPR అందించారు. నర్సు కృషితో పాప తిరిగి శ్వాస తీసుకోవడం, ఏడవటం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ చిన్నారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ‘ఆ సమయంలో నర్సు అక్కడ లేకపోయినా, పాపకు ఆ డైపర్ లేకపోయినా నా బిడ్డ దక్కేది కాదు. ఇది నిజంగా దేవుడి దయే’ అని చిన్నారి తండ్రి అరవింద్ రాథోడ్ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కోతుల బెడద పై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story