USAID: మా రికార్డుల్లో నమోదు కాలేదు.. యూఎస్ఎయిడ్ నిధులపై క్లారిటీ ఇచ్చిన బంగ్లాదేశ్

by Shamantha N |

యూఎస్‌ఎయిడ్‌(USAID) ద్వారా భారత్, బంగ్లాదేశ్ కు అందించిన నిధులపై ట్రంప్ చేసిన ప్రకటనపై దుమారం రేగుతోంది.

USAID: మా రికార్డుల్లో నమోదు కాలేదు.. యూఎస్ఎయిడ్ నిధులపై క్లారిటీ ఇచ్చిన బంగ్లాదేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్‌ఎయిడ్‌(USAID) ద్వారా భారత్, బంగ్లాదేశ్ కు అందించిన నిధులపై ట్రంప్ చేసిన ప్రకటనపై దుమారం రేగుతోంది. కాగా.. ఈ అంశంపై బంగ్లాదేశ్ స్పందించింది. బంగ్లాదేశ్‌ (Bangladesh)కు యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా రూ.251 కోట్లను (29 మిలియన్‌ డాలర్లు) సాయంగా అందించామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆ దేశం కొట్టిపారేసింది. బంగ్లాదేశ్ ఎన్జీవో వ్యవహారాల బ్యూరో చీఫ్ మాట్లాడుతూ.. ‘‘ఆ నిధులు మా రికార్డుల్లో నమోదు కాలేదు. ఏఏ ఎన్జీవోల ప్రమేయం ఉందని వారు చెప్తే.. మేం వాటిని గుర్తిస్తాం. మా పరిధి దాటి వారు నిధులు ఎలా పంపుతున్నారో మాకు తెలియదు’’ అని వెల్లడించారు. అలాగే 75 ఎన్జీవోలకు విదేశీ నిధులు అందుతున్నాయని తెలిపారు. విదేశీ దాతలు నమోదిత ఎన్జీఓలకు విరాళం ఇస్తేనే.. ఆ వివరాలు తమ రికార్డులో ఉంటాయన్నారు. అయితే, యూఎస్‌ఎయిడ్‌ నుంచి ప్రభుత్వానికి అందిన నిధులు ఏజెన్సీలకు బదిలీ అయితే ఆ లెక్కలు తమ దగ్గర ఉండవని స్పష్టం చేశారు.

ట్రంప్ ఆరోపణలు

భారత్‌లో ఓటింగ్‌ను పెంచేందుకు బైడెన్‌ హయాంలో అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పలుమార్లు విమర్శలు గుప్పించారు. యూఎస్‌ఎయిడ్‌ ద్వారా అందిన 21 మిలియన్‌ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.182 కోట్లు) నిధులపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు, యూఎస్‌ఎయిడ్‌ ద్వారా భారత్‌లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో రూ.6,498 కోట్ల (750 మిలియన్‌ డాలర్లు) నిధులు వచ్చాయని, అయితే అవి ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచడానికి కాదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి యూఎస్‌ ఎయిడ్‌ కొన్ని ప్రాజెక్టులపై పని చేస్తోందని వెల్లడించింది. మరోవైపు, బంగ్లాదేశ్‌ (Bangladesh)కూ యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా రూ.251 కోట్లను (29 మిలియన్‌ డాలర్లు) సాయంగా అందించామని, ఆ నిధులతో వారు కమ్యూనిస్టులకు ఓటేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢాకా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.

Next Story