- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohanlal: సత్యాన్ని వక్రీకరించే సినిమా విఫలమవ్వడం ఖాయం- ఎంపురాన్ సినిమాపై బీజేపీ విమర్శలు
మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ రిలీజ్ ఎంపురాన్ పై వివాదం కొనసాగుతోంది. 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావించినందుకు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ రిలీజ్ ఎంపురాన్ పై వివాదం కొనసాగుతోంది. 2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావించినందుకు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈవివాదంపై బీజేపీ కేరళ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. సత్యాన్ని వక్రీకరించే సినిమా విఫలమవ్వడం ఖాయం అని అన్నారు. "ఒక సినిమాను సినిమాగా చూడాలి. దాన్ని చరిత్రగా చూడలేము. అలాగే, సత్యాన్ని వక్రీకరించి కథను నిర్మించడానికి ప్రయత్నించే ఏ సినిమా అయినా విఫలమవడం ఖాయం. అందుకే నేను లూసిఫర్ సీక్వెల్ చూడలేదు. ఈ సినిమా నిర్మాణం పట్ల నిరాశ చెందాను" అని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ ఎంపురాన్ సినిమా నిర్మాతలకు తమ హృదయపూర్వక మద్దతును అందించారు. సంఘ్ పరివార్ చరిత్రను వక్రీకరిస్తోందని ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం తన కుటుంబసభ్యులతో కలిసి ఎంపురాన్ సినిమాను మల్టీప్లెక్స్ లో చూశారు. అంతే కాకుండా, ఆ చిత్ర బృందానికి మద్దతు ఇచ్చారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అన్ని విధాలుగా కాపాడాలని పేర్కొన్నారు. ఇకపోతే, ఈ సినిమా వివాదం తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 17 మార్పులు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సీబీఎఫ్‌సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, జెరోమ్ ఫ్లిన్, ఎరిక్ ఎబౌనీ ప్రధాన పాత్రల్లో నటించారు.
మోహన్ లాల్ క్షమాపణలు
ఈ వివాదంపై మోహన్ లాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులకు "బాధ" కలిగించినందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. మోహన్ లాల్ తన పోస్ట్‌లో రాస్తూ..'ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. దానికంటే గొప్ప మోహన్ లాల్ లేడని నా నమ్మకం...ఇట్లు ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ పోస్ట్ చేశారు.






