Modi: రాజీ పడే ప్రసక్తే లేదు.. ట్రంప్ సుంకాలపై మోడీ కౌంటర్

by Prasad Jukanti |

ట్రంప్ సుంకాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Modi: రాజీ పడే ప్రసక్తే లేదు.. ట్రంప్ సుంకాలపై మోడీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడేది లేదని ప్రధానమంత్రి మోడీ (PM Modi) స్పష్టం చేశారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan) శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ట్రంప్ విధించిన సుంకాలపై (Trump Tariff Hike) పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమమే తన ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వెల్లడించారు. ఈ విషయంలో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుసని, అయినా రైతుల ప్రయోజనాల కోసం అందుకు భారత్ సిద్ధంగా ఉందని యూఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. వాణిజ్య చర్చల సమయంలో అమెరికా, భారత వ్యవసాయ మార్కెట్‌‌లోకి మొక్కజొన్న, సోయాబీన్స్, పత్తి వంటి పంటలకు మరింత ప్రవేశం కల్పించాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్ ఎగుమతులపై 50 శాతం సుంకాలను విధించడం తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ అమెరికాకు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

ఎంఎస్ స్వామినాథన్ స్మారక స్టాంపు విడుదల..

ప్రముఖ వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి సందర్భంగా ఆయన స్మారక నాణెం, శతాబ్ది స్మారక స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. స్వామినాథన్ జీవవైవిధ్యాన్ని దాటి జీవ-ఆనందం అనే దార్శనిక భావనను అందించారని మోడీ కొనియాడారు. వ్యవసాయ శాస్త్రంలో ఆయన చేసిన మార్గదర్శక కృషి నేటికీ భారతదేశ వ్యవసాయ రంగం అనుసరిస్తోందన్నారు. ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వావలంబన చేయడానికి చేసిన ఉద్యమానికి స్వామినాథన్ నాయకత్వం వహించారని మోడీ గుర్తు చేశారు.

Next Story