మోడీ కేబినెట్ సంచలన నిర్ణయం.. వరి మద్దతు ధర భారీగా పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 13:47:00  IST  )

ప్రధాని మోడీ అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీలో వరి మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

మోడీ కేబినెట్ సంచలన నిర్ణయం.. వరి మద్దతు ధర భారీగా పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో (Union Cabinet Meeting)దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తీపి కబురు చెప్పారు. రాబోయే ఖరీఫ్ సీజన్ (Kharif Season) దృష్ట్యా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పంటల కనీస మద్దతు ధర (MSP) పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కొత్త ధరలను నిర్ణయించారు. సాధారణ వరి రకానికి కనీస మద్దతు ధరను రూ.2,441 గా ఖరారు చేశారు. నాణ్యమైన వరి గ్రేడ్-ఏ రకానికి మద్దతు ధరను రూ.2,461 గా నిర్ణయించారు. జొన్నలు హైబ్రిడ్ క్వింటాల్‌కు మద్దతు ధర రూ.4,023, మల్దండి జొన్నలు రూ.4,073, సజ్జలు రూ.2,900, రాగులు రూ.5,025, మొక్కజొన్న రూ.2,410, కందులు రూ.8,450, పెసర్లు రూ.8,780, మినప క్వింటాలుకు మద్దతు ధర రూ.8,200గా నిర్ణయించారు. అదేవిధంగా రాబోయే ఖరీఫ్ పంటల మద్దతు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది.

నాగ్‌పూర్ విమానాశ్రయానికి మహర్దశ..

వ్యవసాయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ప్రాధాన్యం ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని (Nagpur International Airport) అంతర్జాతీయ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో రవాణా, పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది. పర్యావరణ హితమైన ఇంధన ఉత్పత్తి , విద్యుత్ రంగంలో స్వావలంబన కోసం ‘కోల్ గ్యాసిఫికేషన్’ (Coal Gasification) పథకానికి కేంద్రం రూ.37,500 కోట్లను కేటాయించింది. దీంతో ఎల్ఎన్‌జీ (LNG) దిగుమతి భారం మరింత తగ్గనుంది. సర్కేజీ - ధోలేరా మధ్య సెమి హై స్పీడ్ డబుల్ రైల్వే‌లైన్ నిర్మాణానికి రూ.20,065 కోట్ల కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story