- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కోతి’ అని సరదాగా పిలిచిన భర్త.. మోడల్ ఆత్మహత్య!
సరదాగా అన్న మాట ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. భర్త తనను ‘కోతి’ (బందరియా) అని పిలిచినందుకు మనస్తాపం చెందిన ఒక మోడల్ బలవన్మరణానికి పాల్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సరదాగా అన్న మాట ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. భర్త తనను ‘కోతి’ (బందరియా) అని పిలిచినందుకు మనస్తాపం చెందిన ఒక మోడల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. ఆదత్‌గంజ్ ప్రాంతానికి చెందిన తన్నూ సింగ్ అనే యువతికి, రాహుల్ సింగ్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తన్నూ సింగ్ మోడలింగ్‌పై మక్కువతో ఆ రంగంలో రాణిస్తోంది. తన అందం, కెరీర్ పట్ల ఆమె ఎంతో శ్రద్ధ వహించేది. జనవరి 28న ఈ దంపతులు సీతాపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఈ క్రమంలో భర్త రాహుల్ సింగ్ తన భార్య తన్నూను చూసి సరదాగా ‘కోతిలా ఉన్నావు’ అని వ్యాఖ్యానించాడు. అందరి ముందు భర్త అలా అనడంతో తన్నూ తీవ్ర అవమానంగా భావించింది.
గదిలోకి వెళ్లి ప్రాణాలు తీసుకున్న మోడల్..
భర్త మాటలతో నొచ్చుకున్న ఆమె వెంటనే అక్కడి నుంచి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆమె అలిగిందని భావించిన కుటుంబ సభ్యులు కాసేపటి తర్వాత సర్దుకుంటుందని అనుకున్నారు. అయితే, రాత్రి భోజనం సమయానికి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన రాహుల్, కిటికీ గుండా చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సున్నిత మనస్తత్వమే కారణమా?
తన్నూ సోదరి అంజలి మీడియాతో మాట్లాడుతూ.. తన్నూ తన అందం విషయంలో చాలా సున్నితంగా ఉండేదని, భర్త అన్న మాట ఆమెను బాగా గాయపరిచిందని తెలిపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ‘ప్రస్తుతానికి ఈ ఘటనపై ఎటువంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. ఆమె సున్నిత మనస్తత్వం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం. అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం’ అని లక్నో పోలీసులు వెల్లడించారు.






