‘ఆమె లేక నేను ఉండలేను’.. పెళ్లైన మహిళతో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా!

by Ramesh Naini |

ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో ఒక విస్మయం కలిగించే ఘటన వెలుగుచూసింది.

‘ఆమె లేక నేను ఉండలేను’.. పెళ్లైన మహిళతో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లాలో ఒక విస్మయం కలిగించే ఘటన వెలుగు చూసింది. ఒక 28 ఏళ్ల వివాహిత, 17 ఏళ్ల మైనర్ బాలిక మధ్య ఏర్పడిన ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో బాలిక ఆత్మహత్యాయత్నం చేయడం, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రేమ ఎలా మొదలైంది?

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. పిథోరాగఢ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 28 ఏళ్ల వివాహితకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త ఉపాధి కోసం వేరే నగరంలో ఉంటున్నాడు. అదే గ్రామంలోని బంధువుల ఇంటికి తరచూ వచ్చే 17 ఏళ్ల బాలిక (12వ తరగతి విద్యార్థిని)తో సదరు మహిళకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా గత ఏడాది కాలంగా గాఢమైన స్నేహంగా, ఆ తర్వాత ప్రేమ (స్వలింగ సంబంధం)గా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని, ఒకరినొకరు వదిలి ఉండలేమని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

కుటుంబాల వ్యతిరేకత - ఆత్మహత్యా ప్రయత్నం

వీరి బంధం గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకరినొకరు కలుసుకోకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ, వారు తమ పంతం వీడలేదు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మైనర్ బాలిక, ఆమె లేకపోతే నేను ఉండలేను అంటూ నాలుగు రోజుల క్రితం లోయలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను రక్షించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.

పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా..

మే 20న (బుధవారం) రాత్రి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఝూలాఘాట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ రాత్రంతా హై వోల్టేజ్ డ్రామా నడిచింది. చట్టపరమైన నిబంధనలు, వయసు వ్యత్యాసం, సామాజిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతల గురించి పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ ఇద్దరూ వినలేదు. కలిసి ఉంటామంటూ పోలీసుల ఎదుటే మొండికేశారు. కాగా, బాలిక మైనర్ కావడంతో పోలీసులు బాలల హక్కుల పరిరక్షణ చట్టాలకు ప్రాధాన్యత ఇస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. పోలీసులు మైనర్ బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి, భద్రత దృష్ట్యా ‘వన్ స్టాప్ సెంటర్‌’ (One Stop Centre) కు తరలించారు. వివాహితను పోలీసులు తీవ్రంగా మందలించారు. చట్టపరమైన హెచ్చరికలు జారీ చేసి, తదుపరి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మైనర్లకు సంబంధించిన కేసు కావడంతో బాలల పరిరక్షణ నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తున్నట్లు ఝూలాఘాట్ ఎస్‌హెచ్‌ఓ సంజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు.

Next Story