Aadhar Numbers: చనిపోయినా యాక్టివ్‌గానే ఉండిపోయిన ఆధార్ నంబర్లు

by S Gopi |   (  Updated:2025-07-16 06:58:02  IST  )

దేశంలో 2007 నుంచి 2019 మధ్య ప్రతి సంవత్సరం సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి.

Aadhar Numbers: చనిపోయినా యాక్టివ్‌గానే ఉండిపోయిన ఆధార్ నంబర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విషయంలో కీలక విషయాలు వెళ్లడయ్యాయి. గడిచిన 14 ఏళ్ల కాలంలో 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ, అందులో 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది దేశంలో జరిగే మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువ. ఈ మేరకు ఇండియా టుడే టీవీ దాఖలు చేసిన సమాచార హక్కు(ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. 2025, జూన్ నాటికి దేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ప్రకారం, 2025 ఏప్రిల్ నాటికి దేశ మొత్తం జనాభా 146.39 కోట్లుగా ఉంది. దీనికి విరుద్ధంగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) అధికారిక డేటా ప్రకారం, దేశంలో 2007 నుంచి 2019 మధ్య ప్రతి సంవత్సరం సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. దీన్ని బట్టి గత 14 ఏళ్లలో 11 కోట్లకు పైగా మరణాలు రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, యూఐడీఏఐ కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేసింది. ఇది అంచనా వేసిన మరణాల్లో 10 శాతం కంటే తక్కువ. అయితే, డీయాక్టివేషన్ ప్రక్రియ క్లిష్టంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల నుంచి జరగాల్సిన అప్‌డేట్ డేటాపై ఎక్కువగా ఆధారపడి ఆధార్ డీయాక్టివేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాలకు.. గత ఐదేళ్లలో మరణాల ఆధారంగా ప్రతి ఏటా జరిగిన ఆధార్ నంబర్ల డీయాక్టివేట్ గురించి సరైన సమాచారం తమ వద్ద లేదని యూఐడీఏఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేశామని మాత్రమే వెల్లడించింది. దీనివల్ల ఆధార్ వ్యవస్థలో ఉన్న లోపాలు బహిర్గతం అవుతాయని, యాక్టివ్ ఆధార్ నంబర్లు దుర్వినియోగం అయ్యే వీలుంటుందని విశ్లేషలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story