మీరట్‌లో మరో షాకింగ్ ఘటన.. ప్రియుడిపై మోజుతో భర్తనే హత్య.. దాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద స్కెచ్

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడిపై మోజుతో భర్తనే హత్య చేసింది.

మీరట్‌లో మరో షాకింగ్ ఘటన.. ప్రియుడిపై మోజుతో భర్తనే హత్య.. దాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద స్కెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని (Meerut) మీరట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడిపై మోజుతో భర్తనే హత్య చేసింది. తర్వాత హత్యను కప్పిపుచ్చేందుకు (snakebite) పాము కాటుగా చిత్రీకరించి డ్రామాలు ఆడింది. చివరికి పోస్ట్‌మార్టం రిపోర్టులో అసలు బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం మీరట్ జిల్లాలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో 25 ఏళ్ల అమిత్ నిద్రలోనే పాము కాటుకు గురై మరణించినట్లు భావించారు. బుధవారం సాయంత్రం విడుదలైన పోస్ట్‌మార్టం నివేదిక చూడగానే పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అమిత్ పాము కాటు విషం వల్ల కాదు, గొంతు నులిమి ఊపిరాడక పోవడం వల్లే చనిపోయాడని పోస్ట్ మార్టం నివేదిక నిర్ధారించింది. అతని శరీరంపై పామును ఉంచే సమయానికే అతను చనిపోయాడు కాబట్టి, విషం శరీరమంతా వ్యాపించలేదు. పాము కాటు కూడా కుట్రపూరితంగా చేశారని నివేదికలో నిర్ధారణ అయింది.

పోస్టుమార్టం నివేదికలో మరణానికి కారణం వెల్లడైన తర్వాత, పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అమిత్ భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్జీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దాదాపు ఒక ఏడాది నుంచి సంబంధం పెట్టుకున్నారని అంగీకరించారు. రోజువారీ కూలీ అయిన అమిత్‌కు ఈ వ్యవహారం గురించి తెలియడంతో తరుచూ భార్యతో వాదనలకు దిగేవాడు. దీంతో భర్తను అడ్డు తొలగించేందుకు ఇద్దరు కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసులకు తెలిపారు. అమిత్‌ను మొదట గొంతు నులిమి చంపి.. తర్వాత పాము కాటు మరణంలా చూపించే ప్రయత్నం చేశారు. నిందితులు పామును రూ. వెయ్యికి కొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. పాము కాటు వేసినట్లు అతని శరీరంపై పామును ఉంచారు.

పది సార్లు అతను పాముకాటుకు గురి చేశారు. మరుసటి రోజు పామును పట్టుకునే వ్యక్తిని పిలిపించి దాన్ని పట్టుకున్నారు. పాము కాటుకు గురై చనిపోయినట్లు వీడియో సైతం గ్రామంలో వైరల్ అయింది. ఆ తర్వాత వచ్చిన పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయట పడింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇటీవల మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మీరట్‌లో మరో భర్త.. భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.

Next Story