మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. రంగంలోకి దిగిన ఏఐసీసీ

by Kema Shiva Kumar |

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఏఐసీసీ అలర్ట్ అయింది.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. రంగంలోకి దిగిన ఏఐసీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించగా.. ఆ అంశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) చాలా సీరియస్‌గా తీసుకుని ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఈ అంశంలో న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలు, చట్ట నిపుణులు తెలంగాణ అడ్వకేట్ జనరల్ (AG) అత్యవసరంగా భేటీ అయి మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై నమోదైన కేసు తీవ్రత ఎంత, అసలు అది ఎఫ్ఐఆర్ (FIR) రూపంలో ఉందా? లేక కేవలం కోర్టు నుంచి వచ్చిన షోకాజ్ నోటీసు మాత్రమేనా.. అనే చట్టపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కేవలం కోర్టు నోటీసులను అఫిడవిట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదని, దీనిపై రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందనే కోణంలో ఏఐసీసీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది.

కాగా, తెలంగాణలో నమోదైన ఓ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాచిపెట్టారంటూ బీజేపీ (BJP) నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని, ఆమె ఆ వివరాలను దాచారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటింటించిన విషయం తెలిసిందే.

Next Story