కాలేజ్‌లో వేధింపులు.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. బెంగళూరులో ఘటన

by Ramesh Naini |

కాలేజ్‌లో జరిగిన అవమానాలు, మానసిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాలేజ్‌లో వేధింపులు.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య.. బెంగళూరులో ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలేజ్‌లో జరిగిన అవమానాలు, మానసిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని 23 ఏళ్ల యశస్వినిగా గుర్తించారు. ఆమె బొమ్మనహళ్లి ప్రాంతంలోని ఆక్స్‌ఫర్డ్ డెంటల్ కాలేజ్‌లో రేడియాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతోంది.

తరగతి గదిలో అవమానించిన లెక్చరర్

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యశస్వినికి కంటి నొప్పి కారణంగా జనవరి 7న కాలేజ్‌కు హాజరుకాలేకపోయింది. మరుసటి రోజు కాలేజ్‌కు వెళ్లినప్పుడు, లెక్చరర్ తరగతి గదిలోనే ఆమెను అవమానపరిచారని ఆరోపిస్తున్నారు. కంటి చుక్కలపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు, సెమినార్ ప్రెజెంటేషన్‌కు అనుమతి ఇవ్వకపోవడం, రేడియాలజీ కేసు హ్యాండ్లింగ్‌కు నిరాకరించడం వంటి చర్యలు తీసుకున్నారని కుటుంబం తెలిపింది.

మార్చురీ ఎదుట విద్యార్థుల ఆందోళన

యశస్విని తల్లి పరిమళ మాట్లాడుతూ, ‘ఒక్క రోజు కాలేజ్‌కి హాజరుకానందుకు నా కూతురిని అందరి ముందు అవమానించారు. ఆమె కంటి గాయం గురించి మాకు చెప్పింది. చదువుల్లో ఎప్పుడూ ముందుండే అమ్మాయి. ఇలాంటి అవమానాలు ఆమెను తీవ్రంగా బాధించాయి. లెక్చరర్‌తో పాటు కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. తాను ఏకైక కుమార్తెను కోల్పోయానని, ఇలాంటి అన్యాయం మరో విద్యార్థికి జరగకూడదని ఆమె వాపోయారు. ఈ ఘటనపై తాజాగా విద్యార్థులు, సహచరులు మృతదేహాన్ని ఉంచిన మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజ్ ప్రిన్సిపల్‌, సంబంధిత లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story