డాక్టర్ చదువు.. దొంగ తెలివితేటలు: చెప్పుల్లో ఫోన్ దాచి ఎంబీబీఎస్ పరీక్షకు హాజరు!

by Gantepaka Srikanth |

సినిమాల్లో 'మున్నాభాయ్' తరహాలో వినూత్నంగా కాపీ కొట్టడం మనం చూసి ఉంటాం.

డాక్టర్ చదువు.. దొంగ తెలివితేటలు: చెప్పుల్లో ఫోన్ దాచి ఎంబీబీఎస్ పరీక్షకు హాజరు!
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో 'మున్నాభాయ్' తరహాలో వినూత్నంగా కాపీ కొట్టడం మనం చూసి ఉంటాం. కానీ, నిజ జీవితంలో ఒక ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థి అంతకంటే తెలివిగా ఆలోచించి అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ (AIIMS)లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. రిషికేశ్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక విద్యార్థి పరీక్షా కేంద్రంలోకి వెళ్తుండగా, గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వెంటనే అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. ఆ విద్యార్థి తన చెప్పుల అడుగు భాగాన్ని చాలా చాకచక్యంగా కట్ చేసి, దాని లోపల ఒక మొబైల్ ఫోన్‌ను అమర్చాడు. బయటకు చూడటానికి సాధారణ చెప్పుల్లాగే ఉన్నా, లోపల మాత్రం కాపీ కొట్టడానికి అవసరమైన సెటప్ సిద్ధం చేసుకున్నాడు.

వైరల్ అవుతున్న వీడియో..

ఈ తనిఖీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భద్రతా సిబ్బంది ఆ చెప్పులను విడదీసి, లోపల అమర్చిన మొబైల్ ఫోన్‌ను బయటకు తీయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు "చదువుకోవడానికి వాడాల్సిన తెలివితేటలను ఇలాంటి పనులకు వాడుతున్నారా?" అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఎయిమ్స్ పరిపాలనా విభాగం చాలా సీరియస్‌గా తీసుకుంది. సదరు విద్యార్థిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు భద్రతను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీ యంత్రాలను (Metal Detectors) పెంచాలని నిర్ణయించారు.

Next Story