Odisha: ఒడిశాలో భారీగా నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగుల ప్రయోగించిన పోలీసులు

by S Gopi |   (  Updated:2025-07-16 08:01:33  IST  )

ఈ వ్యవహారంలోనే తాజాగా కాలేజ్ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Odisha: ఒడిశాలో భారీగా నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగుల ప్రయోగించిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలసోర్‌లో విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఒడిశాలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 20 ఏళ్ల విద్యార్థిని ఈ నెల 14న మరణించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో ప్రిన్సిపాల్, కాలేజీ అంతర్గత కమిటీలు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో విద్యార్థిని క్యాంపస్‌లోనే నిప్పంటించుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రజల్లోనూ ఆగ్రహాన్ని పెంచింది. ఈ వ్యవహారంలోనే తాజాగా కాలేజ్ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బీజేడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, 'బాలసోర్ బంద్'కు పిలుపునిచ్చారు. బుధవారం భువనేశ్వర్‌లో భారీ నిరసన ప్రదర్శన జరగ్గా, పోలీసులు బిజు జనతాదళ్ కార్యకర్తలను చెదరగొట్టడానికి వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే భువనేశ్వర్‌లో అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపేందుకు వేలాది మంది ఆందోళనకారులు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. మరోవైపు, బంద్ కారణంగా బాలసోర్ సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రక్కులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఏకమైన ప్రతిపక్షాలు

విద్యార్థి మరణం వల్ల ఏర్పడిన ఆగ్రహావేశాల మధ్య, ఒడిశాలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజు జనతాదళ్ ఈ ఘటన విషయంలో ఐక్యంగా వ్యవహరించాయి. రెండు పార్టీలు ఒకే వైఖరిని ఎన్నుకున్నాయి. బుధవారం ఒడిశాలోని కాంగ్రెస్ పార్టీ విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలసోర్‌లో కొవ్వొత్తుల నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విద్యార్థికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. బాధితురాలి కుటుంబానికి కాంగ్రెస్ న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ విచారం వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠినమైన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

Next Story