హుబ్బళ్లిలో భారీ అగ్నిప్రమాదం .. సుఖసాగర్ మెట్రో మాల్‌లో చెలరేగిన మంటలు

by Naga Rani Yarlagadda |

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని మరాఠా గల్లీలో ఉన్న సుఖసాగర్ మెట్రో మాల్‌లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

హుబ్బళ్లిలో భారీ అగ్నిప్రమాదం .. సుఖసాగర్ మెట్రో మాల్‌లో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని మరాఠా గల్లీలో ఉన్న సుఖసాగర్ మెట్రో మాల్‌లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాల్‌లోని నాలుగో, ఐదో అంతస్తులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఫర్నిచర్, దుస్తుల షాపులు సహా అనేక వాణిజ్య దుకాణాలు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిమాపక దళాలు, సమీప ప్రాంతాల నుంచి వచ్చిన అదనపు వాహనాలతో మూడు గంటలకుపైగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

భారీగా ఆస్తినష్టం

ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ స్పందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అగ్నిప్రమాదం మొదట నాలుగో అంతస్తులో ప్రారంభమై, ఆపై ఐదో అంతస్తుకు వ్యాపించింది. ప్రతి అంతస్తులో సుమారు 4 వేల నుంచి 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం ప్రకారం మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ వాహనాలు, ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 3 గంటలు శ్రమించాయన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు సమాచారం లేదన్నారు. ప్రస్తుతం ఒక దుస్తుల దుకాణం, ఒక ఫర్నిచర్ సెంటర్‌కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోందని కమిషనర్ తెలిపారు.

Next Story