ఐటీ కారిడార్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ‘టెక్ మహీంద్రా’ గోదాము, ఉద్యోగుల పరుగులు

by Ramesh Naini |

చెన్నైలోని ప్రధాన ఐటీ హబ్ అయిన ఓఎంఆర్ (OMR) రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఐటీ కారిడార్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ‘టెక్ మహీంద్రా’ గోదాము, ఉద్యోగుల పరుగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెన్నైలోని ప్రధాన ఐటీ హబ్ అయిన ఓఎంఆర్ (OMR) రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సోళింగనల్లూర్ - కారప్పాక్కం సమీపంలోని ఎల్కాట్ (ELCOT) క్యాంపస్ వెనుక ఉన్న ‘టెక్ మహీంద్రా’ సంస్థకు చెందిన పాత సామగ్రి గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాత కంప్యూటర్లు, మానిటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాలు నిల్వ ఉంచే గోదాములో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ఎగసిపడి, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది.

సురక్షితంగా ఉద్యోగుల తరలింపు

మంటలు, పొగను చూసి ఐటీ ఉద్యోగులు భయాందోళనలతో పరుగులు తీశారు. అప్రమత్తమైన యాజమాన్యం, పోలీసులు వెంటనే ఎమర్జెన్సీ సైరన్లు మోగించారు. టెక్ మహీంద్రాతో పాటు చుట్టుపక్కల ఐటీ క్యాంపస్‌లలోని వేలాది మంది ఉద్యోగులను అత్యవసర మార్గాల ద్వారా సురక్షితంగా బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారుల సమాచారం.

తీవ్ర ట్రాఫిక్ అంతరాయం

తొరైపాక్కం, తిరువాన్మియూర్, మేడవాక్కం, గిండి తదితర 5 ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. సమీప కంపెనీలకు చెందిన ప్రైవేట్ అగ్నిమాపక వాహనాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story