బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు.. చండీగఢ్‌ సిటీలో హై అలర్ట్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-01 13:10:23  IST  )

చండీగఢ్ నగరంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సెక్టార్ 37లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీ పేలుడు చోటుచేసుకుంది.

బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు.. చండీగఢ్‌ సిటీలో హై అలర్ట్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: చండీగఢ్ నగరంలోని సెక్టార్ 37లో ఉన్న పంజాబ్ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర కార్యాలయం ఎదుట ఇవాళ సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బీజేపీ కార్యాలయానికి సమీపంలో పార్క్ చేసిన స్కూటీలో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు అక్కడకు చేరుకుని నమూనాలను సేకరిస్తున్నాయి.

దర్యాప్తు ముమ్మరం..

ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా..? లేక ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పేలుడు జరిగిందా? అనే కోణంలో చండీగఢ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది. పేలుడు సమాచారం అందిన వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చండీగఢ్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లుగా తెలుస్తోంది.

Next Story