‘ఎక్స్’ సేవల్లో భారీ అంతరాయం.. భారత్ సహా పలు దేశాల్లో నిలిచిపోయిన యాప్, వెబ్‌సైట్

by Ramesh Naini |

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవలు సోమవారం సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా స్తంభించింది.

‘ఎక్స్’ సేవల్లో భారీ అంతరాయం.. భారత్ సహా పలు దేశాల్లో నిలిచిపోయిన యాప్, వెబ్‌సైట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవలు సోమవారం సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా స్తంభించింది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వేలాది మంది వినియోగదారులు తీవ్ర సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. యాప్, వెబ్‌సైట్.. రెండింటిలోనూ ఈ అంతరాయం కలగడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ప్రముఖ వెబ్‌సైట్ ‘డౌన్‌డెటెక్టర్’ (Downdetector) గణాంకాల ప్రకారం.. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6:40 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 25,000కు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడంలోనూ, కొత్త పోస్టులను లోడ్ చేయడంలోనూ (Feed Refresh) సమస్యలు తలెత్తుతున్నట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మరికొందరు లాగిన్ క్రెడెన్షియల్స్ పనిచేయడం లేదని పేర్కొన్నారు.

కారణంపై స్పష్టత లేదు..

అంతరాయానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. సాంకేతిక సమస్యపై ‘ఎక్స్’ సంస్థ ప్రతినిధుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి ఈ సమస్య తలెత్తడం చూస్తుంటే, ఇది కేంద్రీకృత సర్వర్ సమస్య అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది.

గతంలోనూ ఇలాగే..

‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌కు అంతరాయం కలగడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చి 2025 లో కూడా ఇలాగే భారీ స్థాయిలో సేవలు నిలిచిపోయాయి. గతేడాది 2024 నవంబర్‌‌లో క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) సర్వీసుల్లో తలెత్తిన సమస్య వల్ల ‘ఎక్స్’ సహా పలు వెబ్‌సైట్లు మొరాయించాయి. ప్రస్తుతం సేవలు నెమ్మదిగా పునరుద్ధరించబడిన్నట్లు జాతీయ మీడియా సమాచారం అందుతోంది.

Next Story