భారత ఎరువుల రంగంలో భారీ సంక్షోభం: మార్చిలో 24.6 శాతం తగ్గిన ఉత్పత్తి

by Kema Shiva Kumar |

పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా మార్చి నెలలో భారత ఎరువుల ఉత్పత్తి 24.6 శాతం తగ్గి ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది.

భారత ఎరువుల రంగంలో భారీ సంక్షోభం: మార్చిలో 24.6 శాతం తగ్గిన ఉత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా (West Asia)లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎరువుల రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. చైన్ సప్లయ్ సిస్టమ్‌‌లో తలెత్తిన అంతరాయాల కారణంగా ఈ ఏడాది మార్చి నెలలో ఎరువుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 24.6 శాత మేర పడిపోయింది. గత ఐదేళ్ల కాలంలో ఎరువుల ఉత్పత్తి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి అని నిపుణులు తెలిపారు. ఉత్పత్తి కుంటుపడటంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

కోర్ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం..

ఎరువుల రంగంలో వచ్చిన భారీ క్షీణత దేశంలోని ఎనిమిది కీలక రంగాల (Core Sector) సూచీపై ప్రభావం చూపింది. దీనివల్ల మొత్తం ఇండెక్స్ 0.4 శాతం మేర తగ్గింది. దేశీయంగా ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎరువుల తయారీ కర్మాగారాలకు సహజ వాయువు (Natural Gas) సరఫరాను ప్రభుత్వం పెంచింది. సాధారణంగా భారత్ తన మొత్తం ఎరువుల అవసరాల్లో దాదాపు 25 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఎరువుల రంగం ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ఉక్కు (Steel) ఉత్పత్తి 2.2 శాతం, సిమెంట్ ఉత్పత్తి 4 శాతం మేర స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. అయితే, గతంతో పోలిస్తే ఈ రంగాల వృద్ధి వేగం కూడా మందగించింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం సద్దుమణిగితేనే సరఫరా వ్యవస్థ మళ్లీ గాడిన పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story