- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఉపాధి హామీ పథకంలో అనూహ్య స్థాయిలో అవినీతి జరిగిందని, సోషల్ ఆడిట్ ద్వారా 10 లక్షలకు పైగా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఉపాధి హామీ పథకంలో అనూహ్య స్థాయిలో అవినీతి జరిగిందని, సోషల్ ఆడిట్ ద్వారా 10 లక్షలకు పైగా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే పనిని ఏళ్ల తరబడి పదేపదే చూపిస్తూ నిధులను దారి మళ్లించారని, కాలువల పూడికతీత, రోడ్ల క్లీనింగ్ పేరుతో నిధులు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. చివరికి 80 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా పని చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి మోసం చేశారని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కంటే అబద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విమర్శించారు.
ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం..125 రోజులకు పని పెంపు
కాంగ్రెస్ హయాంలో కేవలం రూ. 2 లక్షల కోట్లను మాత్రమే కేటాయించగా.. మోడీ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తాన్ని రూ. 8,48,000 కోట్లకు పెంచామని మంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ స్థానంలో ఇప్పుడు 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ (VB-GRAM G) చట్టం - 2025' అమల్లోకి వచ్చిందని, దీని ద్వారా కార్మికులకు ఏడాదికి 100 రోజులకు బదులుగా 125 రోజుల పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేతనాల చెల్లింపులో జాప్యం జరిగితే జరిమానా విధిస్తామని, కార్మికులకు అదనంగా వడ్డీతో కలిపి సొమ్ము చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త చట్టం నిరుద్యోగ భృతి నిబంధనలను కూడా బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు.
నిర్ణయాధికారం ఇకపై గ్రామసభలకే
గ్రామాభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనులను నిర్ణయించే పాత పద్ధతికి స్వస్తి పలికామని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇకపై ఏ గ్రామంలో ఏ అభివృద్ధి పని జరగాలో కేవలం గ్రామ సభ, సర్పంచ్, గ్రామస్తులు మాత్రమే నిర్ణయిస్తారని తెలిపారు. నిర్ణయాధికారం పై నుంచి కాకుండా గ్రామస్థాయి నుంచే మొదలవ్వాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.






