- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్చిరోలిలో మావోయిస్టు పార్టీకి శరాఘాతం.. 11 మంది కీలక నేతలు సరెండర్
మావోయిస్టు పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 11 మంది కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో విప్లవ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానానికి ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి 11 మంది కీలక మావోయిస్టులు ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM) లాలు అలియాస్ మంగూ పోర్యామి, ఏరియా కమిటీ సెక్రటరీ కమలేష్ అలియాస్ గుండు జుగా మడావిలతో పాటు ఏడుగురు కమాండర్ స్థాయి నేతలు, ఇద్దరు సెక్షన్ స్థాయి సభ్యులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. అయితే, లొంగిపోయిన ఈ 11 మంది మావోయిస్టులపై మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిపై కలిపి మొత్తం రూ. 68 లక్షల నగదు బహుమతి ఉంది. అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న వారు తాజాగా సరెండర్ అవ్వడంతో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు నెట్‌వర్క్ మరింత బలహీనపడినట్లయింది.
కాగా, గడ్చిరోలి పోలీసులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2025 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 123 మంది సాయుధ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒకప్పుడు జిల్లాలోని 10 సబ్-డివిజన్లలో విస్తరించి ఉన్న మావోయిస్టు కార్యకలాపాలు, ప్రస్తుతం కేవలం భమ్రాగడ్ సరిహద్దు ప్రాంతాలకే పరిమితమైనట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం ప్రకారం.. మార్చి 31, 2026 నాటికి దేశం నుంచి మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా బలగాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని, వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని పిలుపునిచ్చారు.






