Manipur: మణిపూర్‌లో మరోసారి బీజేపీ ఎమ్మెల్యేల భేటీ.. త్వరలోనే కొత్త ప్రభుత్వం?

by B.Srinivas |

మణిపూర్‌లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందనే ఊహాగానాల మధ్య 23 మంది బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

Manipur: మణిపూర్‌లో మరోసారి బీజేపీ ఎమ్మెల్యేల భేటీ.. త్వరలోనే కొత్త ప్రభుత్వం?
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ (Manipur) లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందనే ఊహాగానాల మధ్య 23 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం భేటీ అయ్యారు. ఇంఫాల్ లోని మాజీ మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ నివాసంలో బీజేపీ చీఫ్ సర్దా దేవి సమక్షంలో సమావేశమైన శాసనసభ్యులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక తీర్మానం ఆమోదించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ ఏర్పాటుపై డిస్కస్ చేశాం. కొత్త ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావాలి’ అని సర్దాదేవి తెలిపారు.

కాగా, బీజేపీ శాసనసభ్యులు రెండు రోజుల్లోనే రెండు సార్లు భేటీ కావడం గమనార్హం.ఈ సమావేశానికి కొద్ది రోజుల ముందు 10 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ అజయ్ భల్లాను కలిసిన విషయం తెలిసిందే. తమకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో స్థిరమైన, ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారు తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వరుసగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై బీజేపీ అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Next Story