సిగరెట్‌ తాగొద్దన్నందుకు పెట్రోల్‌ ట్యాంక్‌కు నిప్పంటించాడు! తప్పిన పెను ప్రమాదం

by Ramesh Naini |

పెట్రోల్‌ బంకులో సిగరెట్‌ తాగొద్దని వారించినందుకు ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఏకంగా పెట్రోల్‌ పోస్తున్న ట్యాంకులోనే లైటర్ వెలిగించి నిప్పు పెట్టాడు.

సిగరెట్‌ తాగొద్దన్నందుకు పెట్రోల్‌ ట్యాంక్‌కు నిప్పంటించాడు! తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెట్రోల్‌ బంకులో సిగరెట్‌ తాగొద్దని వారించినందుకు ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఏకంగా పెట్రోల్‌ పోస్తున్న ట్యాంకులోనే లైటర్ వెలిగించి నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. బంక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయ్‌పుర్‌లోని ఉర్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 'సంగీత పెట్రోల్ బంకు'కు ధర్మేంద్ర సింగ్, ఇమ్రాన్ ఖురేషి అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా, వెనక కూర్చున్న వ్యక్తి అక్కడే సిగరెట్ వెలిగించేందుకు ప్రయత్నించాడు. పెట్రోల్ బంకులో పొగతాగడం ప్రమాదకరమని, అక్కడ నిప్పు వెలిగించవద్దని అతడిని ఓ వ్యక్తి గట్టిగా వారించారు.

సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం..

ఆగ్రహానికి గురైన ఆ యువకుడు.. సిబ్బంది మాటలను బేఖాతరు చేస్తూ, చేతిలో ఉన్న లైటర్‌తో ఫ్యుయల్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా నిప్పు రాజేశాడు. దీంతో ట్యాంకుతో పాటు పెట్రోల్ పోస్తున్న నోజిల్ (Nozzle) కూడా మంటల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బంకులో ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తున్నప్పటికీ, బంక్ సిబ్బంది ఏమాత్రం తడబడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే మంటలను అదుపు చేసే పరికరాలను (Fire Extinguishers) ఉపయోగించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను పేలుడు సంభవించకుండా, భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితులు ధర్మేంద్ర సింగ్ క్షత్రియ, ఇమ్రాన్ ఖురేషీలను అరెస్ట్ చేశారు. వారిపై ఉర్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఘటనకు వాడిన బైక్, లైటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story