నేనే ముఖ్యమంత్రిని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేనే ముఖ్యమంత్రిని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఆమె స్పష్టం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, ప్రజలు తమకే పట్టం కట్టారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రానప్పుడు లేదా ఓటమి ఎదురైనప్పుడు ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే, మమతా బెనర్జీ మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని అవలంబించారు. "నేను లోక్‌భవన్‌కు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించే ప్రసక్తే లేదు. మేము ఓడిపోలేదు.. గెలిచాం. కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు" అని ఆమె తెగేసి చెప్పారు.

వందకు పైగా సీట్లలో అక్రమాలు..?

ఫలితాల తారుమారుపై మమత తీవ్ర ఆరోపణలు చేశారు. "వందకు పైగా నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో గెలిచారు. కానీ, కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేశారు. మా గెలుపును ఓటమిగా మార్చారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (EC) నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మమత మండిపడ్డారు. బీజేపీని గెలిపించడం కోసమే ఈసీ అడ్డదారులు తొక్కిందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆమె విమర్శించారు.

న్యాయపోరాటానికి సిద్ధం..

ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడిందని, దీనిపై తాము వెనక్కి తగ్గబోమని ఆమె హెచ్చరించారు. బీజేపీ కుట్రలను, ఈసీ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజల తీర్పును బీజేపీ దొంగిలించిందని ఆమె ఆరోపించారు. మొత్తానికి, మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపుతోంది. రాజీనామా చేయనని దీదీ మొండిగా ఉండటంతో, రాబోయే రోజుల్లో రాజ్యాంగ పరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story