బీజేపీ కోసం ఈసీ ‘గేమ్‌’ ఆడుతోంది: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కోసం ఈసీ నేరుగా ప్రచారం చేస్తోందంటూ దీదీ ఆరోపించారు.

బీజేపీ కోసం ఈసీ ‘గేమ్‌’ ఆడుతోంది: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) సిద్దమైంది. మంగళవారం కోల్‌కతాలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొత్తం 294 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం (ECI)పై నిప్పులు చెరిగారు. ‘బీజేపీ తరఫున ఎన్నికల సంఘం అద్భుతమైన గేమ్‌ ఆడుతోంది’ అంటూ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ తీరును తప్పుబడుతూ.. బీజేపీ నేరుగా ప్రచారం చేయలేక ఈసీని వాడుకుంటోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

భవానీపూర్‌ నుంచే బరిలో..

విడుదల చేసిన జాబితాలో భాగంగా మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌ నుంచే బరిలోకి దిగుతున్నారు. ప్రకటించిన జాబితాలో 52 మంది మహిళలకు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన 95 మందికి చోటు కల్పించారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదని, బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటమని ఆమె ఈ సందర్భంగా అభివర్ణించారు.

‘ఢిల్లీ లడ్డూలు ఇక్కడ గెలవవు’

బీజేపీని ఉద్దేశించి మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ ఎందుకు భయపడుతోంది? పోరాడాలని ఉంటే నేరుగా మైదానంలోకి రండి, అంతే తప్ప గ్యాస్ సంక్షోభాలు సృష్టించకండి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లు భారీగా తగ్గుతాయి. ‘ఢిల్లీ లడ్డూలు’ బెంగాల్‌లో గెలవవు.. బెంగాల్ సంస్కృతే గెలుస్తుంది’ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ ఇలా..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఏప్రిల్ 23, రెండో దశ ఏప్రిల్ 29 పోలింగ్, ఫలితాలు మే 4 విడుదల చేయనున్నారు.

Next Story