మనీలాండరింగ్‌ కేసులో సంచలనం.. అప్రూవర్ గా మారుతానన్న జాక్వెలిన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-17 08:30:27  IST  )

మనీలాండరింగ్ కేసులో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారేందుకు సిద్ధమని నటి జాక్వెలిన్ సుప్రీంకోర్టుకు తెలిపింది.

మనీలాండరింగ్‌ కేసులో సంచలనం.. అప్రూవర్ గా మారుతానన్న జాక్వెలిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తాను అప్రూవర్‌ గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తాజాగా ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించింది.

ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

నిబంధనల ప్రకారం.. జాక్వెలిన్ తన అభ్యర్థనను దర్యాప్తు సంస్థ (ED) ముందు ఉంచాలి. అనంతరం ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమెను అప్రూవర్‌గా మార్చవచ్చా లేదా అనే అంశంపై దర్యాప్తు సంస్థ కోర్టులో దరఖాస్తు దాఖలు చేస్తుంది. గతేడాది ఈ కేసులో జాక్వెలిన్‌పై ఉన్న క్రిమినల్ విచారణను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

సుకేశ్ ప్రేమ లేఖలు.. జాక్వెలిన్ వాదన

ప్రస్తుతం జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్, తాను జాక్వెలిన్ ప్రియుడినని పదేపదే చెప్పుకొస్తున్నారు. పలు సందర్భాల్లో ఆమెకు జైలు నుంచి ప్రేమ లేఖలు కూడా రాశారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని సూచించే ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ, జాక్వెలిన్ మాత్రం తాను మోసపోయానని కోర్టులో వాదించారు. సుకేశ్ తనను ఒక వ్యాపారవేత్తగా నమ్మించి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ఈ కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Next Story