- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేంజర్ జోన్‌లో ప్రజాస్వామ్యం.. తమిళనాడు రాజకీయాలపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు టీవీకేకు ఇచ్చిన తీర్పును గవర్నర్ అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న గవర్నర్.. ప్రజాతీర్పును గౌరవించి తీరాలని కోరారు. 108 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసేట్లు ఉందని అభిప్రాయపడ్డారు. గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ నుంచి వస్తున్నాయని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశమివ్వాలని సర్కారియా కమిషన్, బొమ్మై కేసు సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నాయని గుర్తుచేశారు. గవర్నర్‌కు రాజ్యాంగం చదవడం తెలియదా-లేక రాజ్యాంగానికి వ్యతిరేఖంగా ప్రవర్తించాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
యాదృచ్ఛికం కాదు.. కుట్ర..
తమిళనాడులో గవర్నర్ ద్వారా పాలించాలని బీజేపీ చూస్తోంది. 59 సంవత్సరాల ద్రవిడ పార్టీల పాలనకు ప్రజలు చెక్ పెట్టిన మార్పును అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఆయుధంగా వాడుకుంటోంది. కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన తర్వాత కూడా అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. గవర్నర్ కేరళ పర్యటన పేరుతో మరింత జాప్యం చేయడం యాదృచ్ఛికం కాదు.. కుట్ర రాజకీయాల్లో భాగమే. విజయ్ రెండుసార్లు లోక్‌భవన్‌కు వెళ్ళినా వట్టిచేతులతో తిరిగిరావడం చూస్తే గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉన్న బీజేపీ గేట్‌కీపర్ అని స్పష్టమవుతోంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ హోదా నామమాత్రమే.. విచక్షణాధికారాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ద్రోహం. కోట్ల మంది ఓట్లు వేసి విజయ్ పార్టీని గెలిపిస్తే వారి కలలను గవర్నర్ లోక్‌భవన్‌లో బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి దాన్ని బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే దేశంలో ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదం అని మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.






