Kumbh Mela : ‘మహాకుంభ మేళా’.. ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞం : ప్రధాని మోడీ

by Hajipasha |   (  Updated:2024-12-13 15:24:25  IST  )

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌‌లో జరగనున్న మహాకుంభ మేళా(Kumbh Mela)ను ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అభివర్ణించారు.

Kumbh Mela : ‘మహాకుంభ మేళా’.. ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞం : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌‌లో జరగనున్న మహాకుంభ మేళా(Kumbh Mela)ను ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అభివర్ణించారు. కులపరమైన, వర్గపరమైన విభేదాలకు తావు లేకుండా ఈ అపూర్వ ఘట్టం జరుగుతుందన్నారు. భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉనికిని మహాకుంభ మేళా కొత్త శిఖరాలకు చేరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహాకుంభ మేళాకు సంబంధించి ప్రయాగ్‌రాజ్‌‌‌లో రూ.5,500 కోట్లతో 167 కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపడుతున్నారు. వీటిని శుక్రవారం రోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఉత్సవాల్లో తొలిసారి ‘‘సహ్ ఏఐ యక్’’ పేరుతో ఛాట్‌బాట్‌ సేవలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. దీనిద్వారా కుంభమేళాకు హాజరవుతున్న భక్తులతో కమ్యూనికేషన్ మరింత సులభతరం అవుతుందని మోడీ తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు ప్రధాని చెప్పారు. దేశప్రజలంతా మహాకుంభ మేళాకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు..

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్న కార్మికులు, అధికారులను మోడీ అభినందించారు. “ఈసారి జరగబోతున్న మహాకుంభ మేళా ప్రయాగ్‌రాజ్ భూమిపై కొత్త చరిత్రను లిఖించబోతోంది. ఈ వేడుకను ప్రపంచ దేశాలు చర్చించుకునే మహా యజ్ఞంలా నిర్వహిస్తాం. భారత్‌ అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇక ఈ సభకు హాజరుకావడానికి ముందు.. ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంభ కలశానికి కుంభాభిషేకం చేశారు. ఈ కుంభ కలశాన్ని అష్టధాతువులతో తయారు చేసి రత్నాలను పొదిగారు. ఈ పూజల్లో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. కాగా, మహాకుంభ మేళాను ప్రమోట్ చేసేందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలు సహా విదేశాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

Read More..

One Nation One Election : ‘జమిలి’ వ్యవహారం ఆర్టికల్ 370లా జరగొద్దు : ఒమర్ అబ్దుల్లా

Next Story