Mahagathbandhan: అంతర్గత విభేదాలు, బలహీన ప్రచారం.. మహాఘట్‌బంధన్ ఓటమికి కారణాలివే?

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ కూటమికి భారీ షాక్ తగిలింది. గత ఎలక్షన్స్ కంటే ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Mahagathbandhan: అంతర్గత విభేదాలు, బలహీన ప్రచారం.. మహాఘట్‌బంధన్ ఓటమికి కారణాలివే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ కూటమికి భారీ షాక్ తగిలింది. గత ఎలక్షన్స్ కంటే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావించిన కూటమికి ఏ మాత్రం ఆశలు కల్పించేలా ఫలితాలు వెల్లడి కాలేదు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీయే కూటమి హవా కొనసాగించింది. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి విజయం సాధించింది. దీంతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం కాగా మహాఘట్‌బంధన్‌కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఆ కూటమి ఓటమికి దారి తీసిన పలు కారణాలను పరిశీలిద్దాం.

సీట్ షేరింగ్ వివాదం

మహాఘట్‌బంధన్ కూటమిలో సీట్ షేరింగ్ తీవ్ర వివాదాన్ని రేపింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడి నామినేషన్ ప్రక్రియ ముగిసినా సీట్ల పంపకాన్ని అధికారికంగా ప్రకటించలేదు. చివరకు పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు సీట్ షేరింగ్ వెల్లడించినా పలు సీట్లలో పొత్తు కుదరకపోవడంతో కూటమిలోని పార్టీలు పోటీకి దిగాయి. వాటిలో స్నేహ పూర్వక పోటీ ఉంటుందని కూటమి నేతలు వెల్లడించారు. దీంతో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో ప్రజలకు క్లారిటీ రాలేదు. కూటమి సీట్ షేరింగ్ ఖరారుకు ముందే ప్రచారంలో ఎన్డీయే దూసుకు పోయింది. ఆ కూటమి అగ్రనేతలంగా ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ఈ పరిణామం మహాఘట్‌బంధన్‌ను భారీగా దెబ్బ తీసిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ప్రచారంలో ప్రభావం చూపని నేతలు

మహాఘట్‌బంధన్‌లో తేజస్వీ మినహా మిగతా కీలక నేతలెవరూ ఫోకస్ కాలేదు. తేజస్వీ భారీ ర్యాలీలు నిర్వహించినా ఆయనకు తగినంతమంది నాయకులు మద్దతివ్వలేదని స్పష్టమవుతోంది. కూటమిలో సీట్ల పంపకంపై విభేదాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు అంచనా వేస్తు్న్నారు. అంతేగాక సీట్ షేరింగ్ ఖరారులో నిమగ్నమైన నేతలు ప్రచారం నిర్వహించడాన్ని పక్కకు పెట్టారు. తేజస్వి రాష్ట్రవ్యాప్తంగా 100 కి పైగా ర్యాలీలలో ప్రసంగించినప్పటికీ ఆయన ప్రయత్నానికి మద్దతు ఇచ్చే నాయకుడు పార్టీలో మరొకరు లేరు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు అగ్రనేతలు ప్రచారాన్ని ఊపందించినా అనుకున్న ఫలితం రాలేదు.

ఆర్జేడీలో కుటుంబ విభేదాలు

ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తేజస్వి అన్నయ్య తేజ్ ప్రతాప్‌ను ఎన్నికలకు ముందు పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేగాక ఆయన సోదరి రోహిణి ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాల పై విమర్శలు గుప్పించారు. అనంతరం లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా పోటీ చేశారు. దీంతో తేజ్ ప్రతాప్ వైఖరి అనేక చోట్ల ఆర్జేడీని దెబ్బతీసినట్టు తెలుస్తోంది. అంతేగాక లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతు దారులు నిరాశ చెందారు. అంతేగాక ప్రత్యర్థులు చేసిన జంగిల్ రాజ్ ఆరోపణలను కూటమిలోని ఒక్క నేత కూడా తిప్పికొట్టలేదు. వారికి దీటుగా కౌంటర్ ఇవ్వలేదు. ఈ పరిణామం కూడా ప్రజలను ఆర్జేడీకి ప్రతికూలంగా మార్చిందని చెప్పొచ్చు.

అమలు కాని హామీలు !

ఎన్నికల సమయంలో తేజస్వి కొత్త వ్యాపారాల కోసం నితీశ్ చేపట్టిన రూ. 20,000 సీడ్ మనీ పథకాన్ని ఎదుర్కోవడానికి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ. 2,500, జీవికా దీదీస్‌కు నెలకు రూ. 30,000 వేతనం, మహిళలకు రూ. 30,000 ఒకేసారి సాయం వంటి అనేక వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. కానీ ఈ వాగ్దానాలను అమలు చేయడం అసాధ్యమని ఎన్డీయే ప్రకటించింది. ప్రచారంలోనూ ఈ అంశాన్నే ప్రధానంగా తీసుకెళ్లింది. తేజస్వి హామీల కంటే నితీశ్ కుమార్ పథకాలే మేలని ప్రజలకు తెలియజేసి సక్సెస్ అయింది.

నితీశ్, మోడీ ధ్వయం

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే ఎన్డీయే పూర్వ సమన్వయాన్ని కొనసాగించింది. స్పష్టమైన సీట్ షేరింగ్ ను ఖరారు చేసింది. కూటమిలోని కొన్ని పార్టీలు సీట్ల పంపకాలపై అసంతృప్తిగా ఉన్నా దానిని వెంటనే క్లియర్ చేయడంలో విజయం సాధించింది. సరైన టైంలో ప్రజల్లోకి దూసుకెళ్లింది. అంతేగాక నితీశ్ కుమార్, ప్రధాని మోడీ కలిసి పలు వేదికల్లో సంయుక్తంగా పాల్గొన్నారు. దీంతో ఈ అంశం ప్రజల్లో ఎన్డీయేపై విశ్వాసాన్ని పెంచింది. తద్వారా మహాఘట్‌బంధన్ భారీ ఓటమికి ఎదుర్కొంది.

Next Story