Maha kumbh: వసంత పంచమి వేళ కుంభమేళాకు పోటెత్తనున్న భక్తులు.. యూపీ ప్రభుత్వం అలర్ట్

by B.Srinivas |

వసంత పంచమి వేళ సోమవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Maha kumbh: వసంత పంచమి వేళ కుంభమేళాకు పోటెత్తనున్న భక్తులు.. యూపీ ప్రభుత్వం అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: వసంత పంచమి వేళ సోమవారం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో అమృత్ స్నాన్ ఆచరించడానికి భారీగా తరలిరానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు పటిష్టం చేసింది. అమృత స్నాన్‌కు ముందు జీరో-ఎర్రర్ ఈవెంట్‌ను నిర్వహించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 5వ తేదీన ప్రధాని మోడీ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం చేయనున్నారు.

పెరుగుతున్న భక్తుల రద్దీ

వసంత పంచమి కన్నా ముందే మహాకుంభమేళాకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 90 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. దీంతో జాతర ప్రారంభమైన జనవరి 13 నుంచి ఇప్పటి వరకు మహాకుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 33.61 కోట్లకు చేరింది. మరోవైపు మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని హోటళ్ల బుకింగ్‌లు బాగా తగ్గాయి. దీంతో వసంత పంచమి నేపథ్యంలో తమకు మళ్లీ బుకింగ్స్ పెరుగుతాయని హోటళ్ల యజమానులు ఆశిస్తున్నారు.

Next Story