చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా..కల్నల్ సోఫియాపై వ్యాఖ్యలపై విజయ్ షా

by Phanindra |   (  Updated:2025-05-23 13:28:58  IST  )

కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా అంటూ వీడియో విడుదల చేశారు.

చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా..కల్నల్ సోఫియాపై వ్యాఖ్యలపై విజయ్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. తన వల్ల భాషాపరమైన తప్పిదం జరిగిందని, తను ఏ మతాన్ని అవమానించాలని అనుకోలేదని ఆయన తెలిపారు.

‘కొన్నిరోజుల క్రితం పహెల్గాంలో జరిగిన దారుణ మారణకాండ నన్ను కలచివేసింది. నాకు మన దేశమంటే చాలా ప్రేమ. ఆర్మీ అంటే ఎనలేని గౌరవం. అయితే నేను అన్న మాటలు ఒక వర్గాన్ని, మతాన్ని, ప్రజలను బాధపెట్టాయి. అది నా భాషాపరమైన తప్పిదం. నేను ఏ మతాన్ని, కులాన్ని, వర్గాన్ని అవమానించాలని అనుకోలేదు. పొరబాటున నేను పలికిన మాటలకు భారత ఆర్మీకి, సోదరి కల్నల్ సోఫియాకు, దేశ ప్రజలందరికీ మరోసారి చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా’ అని విజయ్ షా పేర్కొన్నారు.

ఇది ఆయన విడుదల చేసిన రెండో క్షమాపణ వీడియో. కొన్నిరోజుల క్రితమే ఒక సిట్ ఏర్పాటు చేసి, షాపై దర్యాప్తు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన తొలుత విడుదల చేసిన క్షమాపణ వీడియోపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేసినట్లు ఒప్పుకోకుండా క్షమాపణ అడగటం ఏంటని నిలదీసింది.

Next Story