టోల్ ప్లాజా వద్ద పేలిన LPG ట్యాంకర్.. ఐదుగురు దుర్మరణం : వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |

టోల్ ప్లాజా వద్ద ఓ ఎల్పీజీ ట్యాంకర్ పేలగా.. ఐదుగురు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

టోల్ ప్లాజా వద్ద పేలిన LPG ట్యాంకర్.. ఐదుగురు దుర్మరణం : వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టోల్ ప్లాజా వద్ద ఓ ఎల్పీజీ ట్యాంకర్ పేలగా.. ఐదుగురు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. NDTV పేర్కొన్న వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలోని ఓ టోల్ గేట్ వద్ద జూన్ 26న ఈ ప్రమాదం జరిగింది. పెట్రోలియం గ్యాస్ (LPG) లోడుతో వెళ్తున్న ట్యాంకర్ టోల్ బూత్ వద్ద నియంత్రణ కోల్పోయి బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న LPG గ్యాసంతా లీకై.. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన 24 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీసీటీవీ నుంచి విడుదలై వైరల్ అవుతున్న వీడియోలో రెండు ట్యాంకర్లు టోల్ ప్లాజా వైపు వస్తున్నట్లు కనిపిస్తోంది. వాటిలో కాన్పూర్ నుంచి ప్రతాప్ గఢ్ వైపు వెళ్తున్న ఒక ట్యాంకర్ డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోగా.. డివైడర్ ను ఢీ కొని టోల్ ప్లాజా పైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయి.. మరుక్షణమే విస్ఫోటనానికి దారి తీసింది. 2 కిలోమీటర్ల వరకూ మంటలు ఎగసిపడగా.. ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర దూబే (40) సహా.. టోల్ ప్లాజ్ ఉద్యోగి ఆలోక్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన టోల్ ప్లాజా ఉద్యోగులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ప్రయాగ్ రాజ్ కు చెందిన అనిల్ జులై 1న, రాయబరేలీకి చెందిన హీరామణి సింగ్ , మధ్యప్రదేశ్ కు చెందిన కృష్ణపాల్ మౌర్య జులై 2న మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించగా.. ఇంకా ఆస్పత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ పేలుడు ధాటికి టోల్ ప్లాజా సమీపంలో పార్క్ చేసి ఉన్న 16 మోటార్ సైకిళ్లు, రెండు కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Next Story