ఎల్‌పీజీ కొరత.. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా పానీపూరీ.. వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-03-16 11:54:06  IST  )

ఎల్‌పీజీ కొరత కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా పానీపూరీ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎల్‌పీజీ కొరత.. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా పానీపూరీ.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంటే అన్నం, పప్పు, కూరలు లేదా గుడ్లు ఇస్తారు. కానీ, (West Bengal) పశ్చిమ బెంగాల్‌లోని ఒక పాఠశాలలో మాత్రం విద్యార్థులకు భోజనానికి బదులుగా 'పానీపూరీ' ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని భద్రకాళి హైస్కూల్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట చేయడం సాధ్యపడలేదు. దీంతో విద్యార్థులు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. బయట నుంచి ఒక పానీపూరీ వ్యాపారిని పాఠశాల ప్రాంగణంలోకి పిలిపించి, విద్యార్థులందరికీ పానీపూరీలను మధ్యాహ్న భోజనంగా అందించింది. ఆ పాఠశాల సహాయ ఉపాధ్యాయురాలు నందిక సర్కార్ ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విద్యార్థులు వరసలో నిలబడి, ఒక్కొక్కరు 5-6 పానీపూరీలను తింటుండటం కనిపిస్తుంది.

పానీపూరీ చిరుతిండిగా బాగుంటుంది..!

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు దీనిని ‘సమయస్ఫూర్తి’ అని మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శలు గుప్పించారు. ‘పానీపూరీ చిరుతిండిగా బాగుంటుంది కానీ, మధ్యాహ్న భోజనంగా ఆరోగ్యకరం కాదు’ అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ పాఠశాలలకు సిలిండర్లు సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా?’ అని మరొకరు ప్రశ్నించారు. ‘గ్యాస్ లేనప్పుడు కట్టెల పొయ్యి మీద వండాల్సింది’ అని మరికొందరు సూచించారు. కాగా, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, వంట గ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది. దేశంలో గృహ అవసరాలకు తగిన వంట గ్యాస్ అందుబాటులో ఉందని పేర్కొంది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు వెల్లడించింది.

Next Story