దేశంలో తక్కువ వర్షాలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక అలర్ట్

by Malleboina Mahesh |

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో కేంద్రం అలర్ట్. జిల్లాల్లో అత్యవసర ప్లాన్స్ అమలు చేయాలని, రైతులకు తక్కువ నీటితో పండే విత్తనాలు ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశం.

దేశంలో తక్కువ వర్షాలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎల్‌నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ ఏడాది తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వానాకాలం సీజన్‌పై దీని ప్రభావం పడకుండా ముందస్తు చర్యల కోసం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని జిల్లాల్లో వెంటనే కంటింజెన్సీ ప్లాన్స్ (అత్యవసర ప్రణాళికలు) అమలు చేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వర్షపాతం తగ్గినా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడకుండా చూసేందుకు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది.

రైతులకు తక్కువ నీటితో పండే విత్తనాలు పంపిణీ

తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ శాఖలు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా తక్కువ నీటి లభ్యతతో సాగయ్యే, తక్కువ కాలంలోనే (త్వరగా) చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంట విత్తనాలను అన్నదాతలకు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఎల్‌నినో వల్ల ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసానిచ్చింది.

Next Story