- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lok Sabha: 2040 కల్లా చంద్రుడిపై త్రివర్ణ పతాకం.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
2040 కల్లా చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగుర వేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2040 కల్లా చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగుర వేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra singh) తెలిపారు. ఇండియన్ అస్ట్రోనాట్ చంద్రునిపై అడుగుపెట్టి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని దీమా వ్యక్తం చేశారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన శుభాంశు శుక్లాపై లోక్ సభలో సోమవారం ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడారు. 2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక భారత అంతరిక్ష రంగంలో కీలక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. 2020లో ప్రయివేట్ సంస్థలకు అంతరిక్ష రంగాన్ని తెరిచిన తర్వాత భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 8 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. వచ్చే దశాబ్దంలో 45 బిలియన్లకు చేరుకుంటుందని చెప్పారు. 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపడుతామని, వ్యోమిత్ర అనే రోబో ద్వారా దీనిని చేపడతామని వెల్లడించారు. 2035లో భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలపై ఆగ్రహం
చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో వారిపై జితేంద్ర సింగ్ ఫైర్ అయ్యారు. శుభాంశు తిరిగి రావడంతో దేశం విజయవంతమైన అంతరిక్ష యాత్రను జరుపుకుంటోందని, అయితే ప్రతిపక్షాలు ఇప్పటికీ గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. అంతరిక్ష శాస్త్రవేత్తలను అభినందించడంలో ప్రతిపక్షం విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం, బీజేపీపై కోపంగా ఉండొచ్చు.. కానీ భారత వైమానిక దళంలో క్రమశిక్షణ కలిగిన సైనికుడైన వ్యోమగామిపైనా ఆగ్రహంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చెందిన భారత్ ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాజ్యసభలో ఇండియన్ పోర్ట్స్ బిల్లుకు ఆమోదం
రాజ్యసభలో ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2025 ఆమోదం పొందింది. మూజు వాణి ఓటు ద్వారా దీనికి సభ ఆమోదం తెలిపింది. దీనికి ఇప్పటికే లోక్ సభ ఆమోదించగా బిల్లును త్వరలోనే రాష్ట్రపతికి పంపించనున్నారు. ఈ బిల్లు1908 నాటి ఇండియన్ పోర్ట్స్ చట్టాన్ని భర్తీ చేస్తుంది. వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడానికి పోర్ట్ విధానాలను సరళీకృతం చేయడం, కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం దీని లక్ష్యం. ‘గత 11 ఏళ్లలో ప్రభుత్వం సముద్ర రంగానికి 11 ఆధునిక చట్టాలను తీసుకువచ్చింది. ఈ సంస్కరణల ద్వారా దేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర శక్తులలో ఒకటిగా మార్చబోతున్నాం’ అని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు.






