- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి దద్దరిల్లిన లోక్‌సభ.. రాహుల్ గాంధీ Vs అమిత్ షా
అధికార, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో లోక్‌సభ మరోసారి దద్దరిల్లింది.

దిశ, వెబ్‌డెస్క్: అధికార, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో లోక్‌సభ మరోసారి దద్దరిల్లింది. ఇవాళ ఎన్నికల సంస్కరణల చర్చ సందర్భంగా అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని కేంద్రం వాడుకుంటుందనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం కోసం ఎన్నికల సంఘం పనిచేయదనే విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత గ్రహిస్తే మంచిదని చురకలంటించారు. SIR విషయంలో ఎన్నికల సిబ్బందిదే పూర్తి బాధ్యత అని అన్నారు. SIR ప్రక్రియ కొత్తదేమీ కాదని, ఆ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ విషయంతో ఎలాంటి చర్చకైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈవీఎంలను ఉపయోగించారని తెలిపారు. 2004లో ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, కానీ, 2014లో ఎన్డీయే గెలిస్తే ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆయనకు సవాలు విసిరారు. ఓట్ల చోరీ విషయంలో తన ఆరోపణలపై సభలో చర్చకు సిద్ధమా..? అంటూ అమిత్ షాను ప్రశ్నించారు. హర్యానాలో 19 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. మొదటిసారి ECIకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు. “నేను ఏం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో నేనే నిర్ణయిస్తాను” అంటూ రాహుల్ సవాలును పక్కనపెట్టి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు సభలో కాంగ్రెస్ ఎంపీలు “రాహుల్ గాంధీ ఛాలెంజ్ స్వీకరించాలి.. SIRపై డిబేట్ పెట్టాల్సిందే” అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా ఇరు పక్షాలను సముదాయించే ప్రయత్నం చేశారు.






