నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌.. టాప్ పాయింట్స్ ఇవే

by Dishanational4 |
నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌.. టాప్ పాయింట్స్ ఇవే
X

దిశ, నేషనల్ బ్యూరో : నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ ఉన్నాయి. వీటి పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్‌ విడుదలైనందున గురువారం నుంచే ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్లను ఉపసంహరించేందుకు ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

అభ్యర్థులు ఇవి గుర్తుంచుకోవాలి

లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించాలి. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలికి అనుమతి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో ఎన్నికల అధికారులు పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. కాగా, నాలుగో విడతలోనే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

Next Story

Most Viewed