సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు

by Disha Web Desk 15 |
సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు
X

దిశ, తల్లాడ : సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపుకై రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాఘమయి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మువ్వ విజయబాబు, పిడమర్తి రవి, బేబీ స్వర్ణ కుమారి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్​ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అహంకారపురితంగా ఉన్న నాయకులకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చెంప చెల్లుమనిపించారని అన్నారు. అధికారం ఎవడబ్బ సొత్తు కాదని, ఇందిరమ్మ రాజ్యం ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథలో 39 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నీళ్లు రాకపోతే ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిధులు తెచ్చి ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రైతులకు ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. విద్యా, వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ధరణిలో కొన్ని సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని దీనిని పరిష్కరిస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క నిరుపేదకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

Next Story