Supreme Court: రాజకీయ నేతల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే- కేంద్రం

by Shamantha N |

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్రం ఖండించింది.

Supreme Court: రాజకీయ నేతల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే- కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్రం ఖండించింది. అది కఠినమైన శిక్ష అని అభిప్రాయపడింది. జీవితకాల నిషేధానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలాంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉఁటుందని పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ లో‘‘జీవితకాల నిషేధం సముచితమా? కాదా? అన్న ప్రశ్న పూర్తిగా పార్లమెంటు పరిధిలోకే వస్తుంది’’ అని పేర్కొంది. దామాషా, సహేతుకత సూత్రాలను పరిగణలోకి తీసుకుని అనర్హత కాలాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుందని వెల్లడించింది. జీవితకాలం కాకుండా, శిక్షను ఆరేళ్లు లేదా కొంత కాలానికి పరిమితం చేయడం ఉత్తమమని సూచించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలు కూడా విస్తృత శ్రేణి కలిగి ఉన్నాయని, అవన్నీ పార్లమెంటు శాసన విధానాల పరిధిలోకే వస్తాయని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(1) ప్రకారం.. చట్టసభ సభ్యులు దోషులుగా తేలినప్పటి నుంచి ఆరేళ్లపాటు వారిపై నిషేధం ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొంది.

2016లో దాఖలైన పిల్

దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసులను త్వరగా పరిష్కరించడం పక్కనపెడితే.. దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2016లో సుప్రీంకోర్టులో ఆయన పిల్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కాగా.. దీనిపైనే అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను కూడా ధర్మసానం పరిశీలించింది. . ప్రస్తుతం, పార్లమెంటు, శాసనసభ సిట్టింగ్ సభ్యులు, మాజీ సభ్యులపై దాదాపు 5 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ నివేదికలో ఉంది. 42 శాతం మంది లోక్ సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడయ్యింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. నివేదిక పరిశీలించిన తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8, సెక్షన్‌ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.

Next Story