Kunal Kamra: బాంబే హైకోర్టుకు కునాల్ కామ్రా

by Shamantha N |

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై (Eknath Shinde) అనుచిత వ్యాఖ్యలు చేసిన కామ్రాపై పలుచోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

Kunal Kamra: బాంబే హైకోర్టుకు కునాల్ కామ్రా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై (Eknath Shinde) అనుచిత వ్యాఖ్యలు చేసిన కామ్రాపై పలుచోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. కాగా.. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ (quash petition) దాఖలు చేశారు. ఈ కేసులు ఆర్టికల్ 19 కింద భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు భంగం కలిగించే ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కాగా.. ఏప్రిల్ 21న ఈ కేసు విచారణకు రానుంది. మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు. అదే స‌మ‌యంలో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని.. మార్చి 27న మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇచ్చిన త‌ర్వాత ఏప్రిల్ 1న న‌మోదైన మూడు ఎఫ్ఐఆర్‌ల‌పై ఖార్ పోలీస్‌స్టేష‌న్‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కునాల్‌ కామ్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. పోలీసులు ఇప్పటివరకు మూడుసార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ కామ్రా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కామ్రా బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు.

వివాదం ఏంటంటే?

ఇటీవలే ముంబైలో కునాల్‌ కామ్రా కామెడీ షో నిర్వహించి దాన్ని రికార్డు చేశారు. అందులో షిండేను‘‘గద్దార్‌’’ (ద్రోహి) తో పోల్చాడు. ఈ సందర్భంగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని లిరిక్స్ ని పాలిటిక్స్ కు అనుకూలంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇది వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్‌ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే, కునాల్ కమ్రామ షిండేకు క్షమాపణలు చెప్పాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పారు. అయితే, దీనిపైనా కునాల్ స్పందించారు. ఈ వ్యవహారంతో పశ్చాత్తాప పడట్లేదని.. కోర్టు ఆదేశిస్తే క్షమాపణలు చెబుతానని అన్నారు.

Next Story