ప్రాణాలతో చెలగాటం.. బస్సు నడుపుతూ ‘రీల్స్’ చూసిన ఆర్టీసీ డ్రైవర్.. వీడియో వైరల్

by Ramesh Naini |

బస్సు నిండా ప్రయాణికులు.. కిక్కిరిసిన రోడ్డు.. ఎదురుగా వాహనాల రాకపోకలు.. కానీ ఆ డ్రైవర్ అవేమీ పట్టనట్టు మొబైల్ ఫోన్‌లో మునిగిపోయాడు.

ప్రాణాలతో చెలగాటం.. బస్సు నడుపుతూ ‘రీల్స్’ చూసిన ఆర్టీసీ డ్రైవర్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సు నిండా ప్రయాణికులు.. కిక్కిరిసిన రోడ్డు.. ఎదురుగా వాహనాల రాకపోకలు.. కానీ ఆ డ్రైవర్ అవేమీ పట్టనట్టు మొబైల్ ఫోన్‌లో మునిగిపోయాడు. కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో కేఎస్ఆర్టీసీ (KSRTC) డ్రైవర్ మహేశ్ బాధ్యతారాహిత్యం ఇప్పుడు ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే? మళవల్లి నుంచి మైసూరు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు (KA 11 E 0547) లో ఈ విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నప్పటికీ, డ్రైవర్ మహేశ్ స్టీరింగ్‌పై దృష్టి పెట్టకుండా మొబైల్‌లో సోషల్ మీడియా రీల్స్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. మళవల్లి-మైసూరు మార్గం సాధారణంగా రద్దీగా ఉండటమే కాకుండా, టూ-వే ట్రాఫిక్ వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఆ డ్రైవర్ అవేమీ పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశాడని ప్రయాణికులు ఆరోపించారు.

ప్రయాణికుల ఆగ్రహం.. చర్యలకు డిమాండ్

డ్రైవర్ తీరును గమనించిన కొందరు ప్రయాణికులు అతని నిర్లక్ష్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు మార్గంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టిన డ్రైవర్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Next Story