- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుళ్ల వేషంలో వచ్చి చోరీ..! వింత దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు
దేవుళ్ల వేషధారణలో తిరుగుతూ ప్రజల దృష్టి మళ్లించి, వారి పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : దేవుళ్లను అడ్డం పెట్టుకుని ప్రజలను నిలువునా దోచుకుంటున్న ఒక వింత దొంగల ముఠా గుట్టును కోల్‌కతా పోలీసులు రట్టు చేశారు. దేవుళ్ల వేషధారణలో తిరుగుతూ ప్రజల దృష్టి మళ్లించి, వారి పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆదివారం కోల్‌కతా పోలీసులు తమ అధికారిక 'ఎక్స్' (@KolkataPolice) వేదికగా వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు వేచి ఉన్న సమయంలో.. కాళీ మాత, శివుడు లేదా ఇతర దేవతల వేషధారణలో ఉన్న వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు. భక్తి భావంతో ప్రజలు వారికి దానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా చేతివాటం ప్రదర్శించి.. వారి పర్సులు, మొబైల్ ఫోన్లను మాయం చేస్తారు. బాధితులు ఆ దేవుళ్ల వేషధారణలో ఉన్నవారు వెళ్ళిపోయే వరకు తమ వస్తువులు పోయాయన్న విషయాన్ని కూడా గుర్తించలేనంత నేర్పుగా వీరు చోరీలకు పాల్పడుతున్నారు.
గుజరాత్ లింక్..
జోరాసంకో పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, హేస్టింగ్స్ ప్రాంతంలో మాటు వేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన అనిల్ రామ్జు సలాత్, ధీరూ కాలోభాయ్ సలాత్, సమీర్ భాయ్ సలాత్, రాజు కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరు కోల్‌కతాలోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి 'వ్యాపారాన్ని' కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం గిరీశ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొబైల్ చోరీ కేసులో మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ సమీర్ అనే ఇద్దరిని పార్క్ స్ట్రీట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ గుజరాత్ ముఠా ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం వీరిని వాచ్ సెక్షన్ కస్టడీలోకి తీసుకున్నామని, ఈ గ్యాంగ్ వెనుక ఇంకా పెద్ద నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.






