చిన్నారుల మిస్సింగ్ కేసులపై కిడ్నాప్ FIR.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-23 11:59:55  IST  )

దేశంలో చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ కోసం ఎదురు చూడకుండా వెంటనే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.

చిన్నారుల మిస్సింగ్ కేసులపై కిడ్నాప్ FIR.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మిస్సింగ్ కేసులను కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తమిళనాడులోని 2011 నాటి ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. పిల్లలు అదృశ్యం, అక్రమ రవాణా జరిగితే వెంటనే పోలీసులు ప్రాథమిక విచారణ కోసం వేచి చూస్తూ ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దొరికిన పిల్లలకు ఆధార్ నమోదు, ధ్రువీకరణ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 47 వేలు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, మిస్సింగ్, మహిళలకు సంబంధించిన కేసుల కోసం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘అఖిల భారత పోలీస్ గ్రిడ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చాల రాష్ట్రాల్లో ఏహెచ్ సీయూలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని అవి సక్రమంగా పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన ఓ మైనర్ బాలిక 2011 అదృశ్యమైంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరిపినా అమ్మాయి జాడ దొరకలేదు.

Next Story