Kharge: రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకే బీజేపీ ప్రయత్నం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by B.Srinivas |

రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Kharge: రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకే బీజేపీ ప్రయత్నం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) ఆరోపించారు. రాజ్యాంగం కాపీ పట్టుకుని దానిపైనే కనికరం లేకుండా దాడి చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ ఆదర్శాలను కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక ఫిర్యాదులు అందాయన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ (Mahathama Gandhi) అధ్యక్షతన జరిగిన నవ సత్యాగ్రహ బైఠక్‌కు100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని బెళగావిలో మంగళవారం జై భీం, జై బాపు, జై సంవిధాన్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. ఇటీవల అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అమిత్ షా కామెంట్స్ ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనని తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, కానీ ఇప్పటి వరకు పార్లమెంటు లోపల అంబేద్కర్‌ను అవమానించిన హోం మంత్రి కేవలం అమిత్ షా మాత్రమేనన్నారు. మోడీ, అమిత్ షాలు ఇద్దరూ రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం లేకపోతే దేశంలో అరాచకం జరిగేదన్నారు. అంతకుముందు ఖర్గే బెళగావి శివార్లలోని సువర్ణ సౌధ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. బాబాసాహెబ్‌ను అవమానించడం ద్వారా అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని అవమానించారని, స్వాతంత్ర్య సమరయోధులను, స్వాతంత్ర్యం కోసం అమరులైన ప్రజలను అగౌరవపరిచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జైరాం రమేశ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా, డిసెంబర్ 27 నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించాల్సి ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ప్రోగ్రాం వాయిదా వేశారు.

Next Story