ఓట్ల చోరీపై గళమెత్తండి.. వీడియోతో ఈసీపై సెటైర్లు వేసిన కాంగ్రెస్!

by Phanindra |   (  Updated:2025-08-13 17:42:24  IST  )

ఓట్ల చోరీపై గళమెత్తాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని వివరించే వీడియోతో ఈసీపై సెటైర్లు వేశారు.

ఓట్ల చోరీపై గళమెత్తండి.. వీడియోతో ఈసీపై సెటైర్లు వేసిన కాంగ్రెస్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో తెలుపుతూ ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ వీడియోలో పోలింగ్ స్టేషన్‌కు ఓటేసేందుకు ఒక కుటుంబం వస్తుంది. అక్కడ ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే బోర్డు పెట్టుకొని ఉన్న ఇద్దరు అధికారులు.. ఆ కుటుంబం ఓట్లన్నీ ఎవరో వేసేశారని చెప్తారు. అదే సమయంలో ఇలా దొంగ ఓట్లు వేసిన కొందరు వచ్చి సదరు అధికారులకు థంబ్స్ అప్ ఇవ్వడంతో వీడియో ముగుస్తుంది.

దీన్ని షేర్ చేసిన ఖర్గే.. ఈ ఓట్ల చోరీ అంశంపై ప్రజలు గళమెత్తాలని, బీజేపీ కబంద హస్తాల నుంచి రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మీ ఓటు హక్కును దొంగిలించే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. ప్రశ్నలు అడగండి, సమాధానాలు రాబట్టండి. ఓట్ల చోరీపై గళమెత్తండి’ అని ఖర్గే పేర్కొన్నారు. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే వీడియోను షేర్ చేశారు.

‘మీ ఓట్ చోరీ జరిగిందంటే మీ అధికారం, గుర్తింపు దొంగతనం చేసినట్లే’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఇదే వీడియోను షేర్ చేశారు. ‘మీ ఓటు దొంగతనం చేశారంటే.. మీ హక్కులు, గుర్తింపును దొంగిలించినట్లే. మీ ఓటు హక్కును కాపాడుకోండి’ అని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. లింక్

Next Story