టెహ్రాన్‌కు ఖమేనీ పార్థివదేహం తరలింపు.. అంత్యక్రియలకు కోట్ల మంది వచ్చే చాన్స్!

by Kema Shiva Kumar |

ఇరాన్ అత్యున్నత నేత అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ముస్తాబవుతోంది.

టెహ్రాన్‌కు ఖమేనీ పార్థివదేహం తరలింపు.. అంత్యక్రియలకు కోట్ల మంది వచ్చే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అధికారిక అంత్యక్రియల వేడుకలకు రాజధాని టెహ్రాన్‌లోని ప్రసిద్ధ ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసల్లా’ ముస్తాబైంది. దాదాపు 3 దశాబ్దాల పాటు ఇరాన్‌ను శాసించిన ఖమేనీ భౌతికకాయాన్ని శనివారం నుంచి ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యాప్తంగా 6 రోజుల పాటు జాతీయ శోకదినాలుగా ప్రకటించారు. అయితే, తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉన్నప్పటికీ వేలాది మంది కార్మికులు మొసల్లా ప్రాంగణాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసల్లా ప్రాంగణంలోని గోడలన్నింటినీ ఖమేనీ భారీ చిత్రపటాలతో, ఇరాన్-ఇరాక్ యుద్ధ కాలం నాటి ఆయన ఫొటోలతో అలంకరించారు. సంతాపానికి గుర్తుగా నల్ల జెండాలు, అలాగే ఇస్లామిక్ సంప్రదాయంలో అమరత్వానికి, ప్రతీకారానికి ప్రతీకగా నిలిచే ఎరుపు రంగు జెండాలను భారీగా ప్రదర్శిస్తున్నారు.

అయితే, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఖమేనీ పిడికిలి బిగించిన చిత్రాలు ‘మేము శోకసంద్రంలో ఉన్నాం.. కానీ పడిపోలేదు.. నిలబడే ఉన్నాం’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. భద్రతా పరంగా టెహ్రాన్‌లో ప్రస్తుతం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. స్పెషల్ పర్మిట్లు ఉన్న వాహనాలను మాత్రమే మొసల్లా పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు. టెహ్రాన్‌‌లో జరిగే అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు సభకు ఇరాన్ నలుమూలల నుంచి దాదాపు 1.50 కోట్ల నుంచి 2 కోట్ల మంది జనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, శనివారం ఉదయం 6 గంటలకే మొసల్లా గేట్లు తెరుచుకోనున్నాయి. ఇక్కడ మూడు రోజుల పాటు నివాళులు అర్పించిన అనంతరం, సోమవారం రాజధాని వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. మంగళవారం షియా పవిత్ర నగరం ఖోమ్ (Qom)కు భౌతికకాయాన్ని తరలించి, చివరగా జూలై 9న ఖమేనీ జన్మస్థలమైన మషద్ (Mashhad) నగరంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

Next Story