- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khalid: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్.. బెయిల్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు షాక్ తగిలింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్ (Umar Khalid), షార్జీల్ ఇమామ్ (Sharjil imam) లకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అల్లర్ల కేసులో వారి పాత్ర తీవ్రమైందని తెలిపింది. దీనిపై వేగంగా విచారణ జరపడం రాజ్యానికి హానికరమని పేర్కొంది. వారిపై వచ్చిన ఆరోపణలను తేలికగా తీసుకోలేమని స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలపై వీరిద్దరూ ప్రజలను తప్పుదారి పట్టించారని, ముస్లిం సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపింది. రెచ్చగొట్టే ప్రసంగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో వాట్సాప్ గ్రూపులను సృష్టించి, కరపత్రాలను పంపిణీ చేశారని, నిరసనలకు పిలుపునిచ్చారని తెలిపింది. ఇవి సాధారణ నిరసనలు కావని దీనివల్ల దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రమాదమని వ్యాఖ్యానించింది. పౌరులకు శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని కానీ దాని ముసుగులో హింసను సహించలేమని తెలిపింది. వీరిద్దరితో సహా మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించింది.
కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య డిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. అనంతరం అదే ఏడాది సెప్టెంబర్ 10న ఉమర్ ఖలీద్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉండగా ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు ఊరట లభించలేదు.






