కలెక్టరేట్‌ వసూలు చేసిన లంచంలో 50 శాతం వాటా.. ఐఏఎస్ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు

by Ramesh Naini |

సురేంద్రనగర్ జిల్లా కలెక్టరేట్‌లో వేగవంతమైన పనుల అనుమతుల కోసం వసూలు చేసిన లంచంలో 50 శాతం వాటా కలెక్టర్ రాజేంద్రకుమార్ పటేల్‌కు చేరేదని సహ నిందితుల వాంగ్మూలాలను ఈడీ ఉదహరించింది.

కలెక్టరేట్‌ వసూలు చేసిన లంచంలో 50 శాతం వాటా.. ఐఏఎస్ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా కలెక్టరేట్‌లో లంచాల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారి రాజేంద్ర కుమార్ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీనగర్‌లో అరెస్టు చేసిన అనంతరం ఆయనను అహ్మదాబాద్‌లోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర (ఎన్‌ఏ) ఉపయోగానికి మార్చేందుకు అనుమతులు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో నిందితులు రూ.10 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించారని ఈడీ పేర్కొంది. కేసు విచారణ నిమిత్తం 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వసూలు చేసిన లంచంలో 50 శాతం వాటా

ఈడీ సమర్పించిన రిమాండ్ దరఖాస్తులో, సురేంద్రనగర్ జిల్లా కలెక్టరేట్‌లో వేగవంతమైన పనుల అనుమతుల కోసం వసూలు చేసిన లంచంలో 50 శాతం వాటా కలెక్టర్ రాజేంద్రకుమార్ పటేల్‌కు చేరేదని సహ నిందితుల వాంగ్మూలాలను ఉదహరించింది. మిగతా మొత్తాన్ని ఇతర అధికారుల మధ్య పంచుకున్నట్లు పేర్కొంది. అలాగే పటేల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆయన తరఫున లంచాల మొత్తాన్ని సేకరించి, తర్వాత నేరుగా పటేల్‌కు అందజేసేవాడని మరో నిందితుడు వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి కేఎం సోజిత్రా, రాజేంద్రకుమార్ పటేల్‌ను జనవరి 7 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Next Story